: 20 కోట్ల మంది ముస్లింలను సమాధి చేసేందుకు స్థలమెక్కడ?: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య
నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుండే బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం, మరణించిన వారిని సమాధి చేయాలని గుర్తు చేసిన ఆయన, దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను సమాధి చేసేందుకు స్థలమెక్కడుందని ప్రశ్నించారు. ఉన్నావోలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన "మీరు ఖబరిస్థాన్ అనండి, శ్మశానం అనండి... అందరినీ సమాధి చేయలేం. హిందువులు మరణిస్తే, స్థలం అక్కర్లేదు. ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారందరినీ ఎక్కడ సమాధి చేయాలి? హిందుస్థాన్ లో అంత భూమి ఎక్కడుంది?" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, యూపీలో జరుగుతున్న ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ భావిస్తోందని, సాక్షి వ్యాఖ్యలు అందుకోసమేనని విమర్శించారు.