: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయ్.. సిద్ధంకండి: స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు వస్తాయని... ఎన్నికలకు సమాయత్తం కావాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా, ఎదుర్కునేందుకు సన్నద్ధంగా ఉండాలని జిల్లాల కార్యదర్శులకు సూచించారు. పార్టీ జిల్లాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా స్టాలిన్ ఈ సూచనలు చేశారు. ఈ సమావేశానికి పార్టీలోని సీనియర్ నేతలందరితో సహా, అన్ని జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు, పార్టీ కేడర్ మొత్తం సిద్ధంగా ఉండాలని సూచించారు.
సమావేశం అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై సమావేశంలో చర్చించామని చెప్పారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించామని... వాటిని మీడియాకు వెల్లడించలేమని తెలిపారు.