: భార్యా బిడ్డలను చంపి, ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ
ఎంటెక్ చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న ఓ కుటుంబంలో మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది. ఉద్యోగం పోగా, తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి, భార్యా పిల్లలను హతమార్చి తానూ ఉరేసుకుని మరణించిన ఘటన బెంగళూరులోని యెలహంక న్యూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బీహారుకు చెందిన అమిత్ కుమార్ ఝా, మీనాక్షిలు దంపతులు. వీరికి మాన్య అనే కుమార్తె ఉంది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండేవారు. ఇటీవల అమిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేయగా, అప్పటి నుంచి మీనాక్షి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన అమిత్, నిత్యమూ ఇంట్లో గొడవ పెట్టుకుంటుండేవాడు.
ఈ నేపథ్యంలో నిన్న ఉదయం కూడా గొడవపడ్డారు. ఆపై మీనాక్షి విధులకు వెళ్లలేదు. స్నేహితులు ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో, వారు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా, మూడు మృతదేహాలూ కనిపించాయి. అమిత్, తన భార్య, పిల్లల గొంతు నులిమి హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.