: ఇండోనేషియా పర్యటనకు సౌదీ రాజు.. ఎలా వెళ్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లడం సర్వసాధారణం. వారి కోసం ఆతిథ్య దేశాలు చేసే ఏర్పాట్ల గురించి కూడా తెలుసు. అయితే కొందరి గురించి తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆతిథ్య దేశ ఏర్పాట్లతో పనిలేకుండా వారే స్వయంగా తమ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక విలాసాలకు పెట్టింది పేరైన సౌదీ రాజ కుటుంబమే విదేశీ పర్యటనకు బయలుదేరితే.. ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. తాజాగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో పర్యటించేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు ప్రపంచ మీడియా దృష్టి అటువైపు మళ్లింది.
ఇక పర్యటన కోసం ఆయన తీసుకెళ్తున్న లగేజీ గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇండోనేషియాకు రాజకుటుంబం తీసుకెళ్తున్న లగేజీ బరువు ఏకంగా 459 మెట్రిక్ టన్నులు. రెండు మెర్సిడెస్ బెంజ్ ఎస్600 లీమోసిన్స్ కార్లు, ప్రత్యేకంగా తయారుచేసిన రెండు విద్యుత్ ఎలివేటర్లు, వారి కుటుంబానికి సపర్యలు చేసేందుకు 572 మంది పనివాళ్లు కూడా రాజు వెంట బయలుదేరుతున్నారు. మొత్తంగా రాజకుటుంబంతో కలిసి ప్రయాణించనున్న వారి సంఖ్య 1500కు పైనే. వీరిలో పదిమంది మంత్రులు, 25 మంది రాకుమారులు, వందమంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అందుకే ప్రపంచం దృష్టి రాజుపై పడింది.
అయితే, విదేశీ పర్యటనలో రాజ కుటుంబం ఇలా హంగుఆర్భాటాలు చూపించడం ఇదే తొలిసారి కాదు. 2015లో వాషింగ్టన్‌లో పర్యటించిన సౌదీ రాజు అక్కడి జార్జ్‌టౌన్‌లోని విలాసవంతమైన ఫోర్ సీజన్స్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. అదే ఏడాది ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఏకంగా వెయ్యిమంది సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాదు.. విమర్శలకూ కారణమైంది. ఇక ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తక్కువేమీ కాదు. 2013లో ఆఫ్రికాలో పర్యటించిన ఆయన వెంట 56 వాహనాలతోపాటు వందలమంది సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కూడా తరలివచ్చారు.