: సిరీస్ గెలిచేందుకు తామేం చేయాలో చెప్పిన ఆసీస్ బౌలర్ స్టార్క్
భారత్-ఆస్ట్రేలియా మధ్య మన దేశంలో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్ నెగ్గి జోరుమీదున్న ఆసీస్ సిరీస్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మిగతా మ్యాచ్‌లు గెలవాలంటే తామేం చేయాల్సి ఉంటుందో కంగారూ పేసర్ మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు. పుణె టెస్ట్‌లో రెండు ఇన్సింగ్స్‌ల్లోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ పరుగులకే (0, 13) పెవిలియన్ పంపిన ఆసీస్ మిగిలిన మ్యాచుల్లోనూ అంటే మరో ఆరుసార్లు కోహ్లీని కట్టడి చేస్తే విజయం తథ్యమని భావిస్తోంది. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసని, ఇప్పటికే ఈ ఏడాదిలో ధారాళంగా పరుగులు చేశాడని స్టార్క్ పేర్కొన్నాడు. మిగతా మ్యాచుల్లో కోహ్లీ కచ్చితంగా ఎదురుదాడి చేస్తాడన్న విషయం తమకు తెలుసన్నాడు. ఈ సిరీస్‌లో అతడి వికెట్ తమకు చాలా ముఖ్యమని, తాము సిరీస్ నెగ్గాలంటే ఇంకో ఆరుసార్లు అతడిని పెవిలియన్ పంపాల్సిందేనని స్టార్క్ వివరించాడు.