: వాసవీ ఇంటర్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హోం మంత్రి నాయినిని అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు
రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. మరోవైపు హైదరాబాద్ వనస్థలిపురంలోని వాసవీ ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఇప్పటివరకూ హాల్ టికెట్లు అందలేదు. మూడు రోజులుగా ప్రతిరోజు హాల్ టికెట్ కోసం వస్తోన్న ఆ కాలేజీకి చెందిన ఎంతో మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందలేదు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వచ్చారు.
రేపు ఉదయం ప్రారంభమయ్యే పరీక్షకు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారని, మరోవైపు తమ పిల్లలకు ఇంకా హాల్ టికెట్లు అందలేదని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. తమ పిల్లలు ఎలా పరీక్ష రాస్తారని నిలదీశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీ నుంచి బయటకు కదలకపోతుండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు హాల్ టికెట్లు రాకపోవడానికి ఆ కాలేజీ ప్రిన్సిపాలే కారణమని తెలుస్తోంది.