: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై జరిగిన హైడ్రామాపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్!


లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిన్న‌ 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం చివ‌ర్లో ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించే క్ర‌మంలో వేదిక‌పైకి వ‌చ్చిన ఫాయే డునావే, వారెన్ బీటీ ఉత్తమ చిత్రం ‘లా లా ల్యాండ్’ అని ప్రకటించారు. ఆ త‌రువాత ఉత్త‌మ చిత్రం ‘లా లా ల్యాండ్’ కాద‌ని 'మూన్‌లైట్' అని నిర్వాహకులు త‌ప్పుదిద్దుకున్నారు. ఈ స‌మ‌యంలో వేదిక‌పై హై డ్రామానే న‌డిచింది.

ఈ సంఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆస్కార్ అవార్డుల‌ నిర్వాహకులు రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉన్నారని, అందుకే అలా జరిగిందని ట్రంప్ విమ‌ర్శల జ‌ల్లు కురిపించారు. తాను గతంలో ఆస్కార్ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నానని, అయితే ఈసారి ఏదో లోపం కనిపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం చివరలో తప్పులు జరిగడంతో, ముగింపు మారిపోయిందని విమ‌ర్శించారు.

కాగా, డొనాల్డ్‌ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ‌ వేడుకలో ఓ దర్శకుడు విమర్శలు చేసిన విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఏడు ముస్లిం దేశాల నుంచి ప్ర‌జ‌లు రాకుండా ట్రంప్ నిషేధాన్ని నిరసిస్తూ త‌న‌కు వచ్చిన అవార్డును స్వీకరించలేదు. ఆస్కార్ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ కూడా ట్రంప్ పై విమ‌ర్శ‌లు గుప్పించిన‌ట్లు మాట్లాడారు. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ ఈ విధంగా స్పందించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News