: పదిమంది బాలికల జీవితాలని కాపాడిన ఫోన్ కాల్!
కేరళ మలప్పురం జిల్లాలోని కరువరకుండు పంచాయతీ పరిధిలో ఓ బాలిక చేసిన ఓ ఫోన్‌కాల్ పదిమంది బాలికల జీవితాలను కాపాడింది. పెళ్లీడు రాకముందే తనకు తన వాళ్లు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న వేసవిలో తన పెళ్లి చేయాలనుకుంటున్నారని ఆ బాలిక చైల్డ్‌లైన్ అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. తన పెళ్లిని ఆపమని కోరింది. తాను చదువుకుంటానని ఆవేదన చెందింది. ఒకవేళ తన పెళ్లేగనుక జరిగితే తాను చనిపోతానని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పంచాయతీ పరిధిలో తనతో పాటు మరో పది మంది బాలికలకి 16 ఏళ్లు కూడా నిండలేదని, వారందరి వివాహాలు కూడా జరుపుతున్నారని తెలిపింది.
దీనిపై వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు కరువరకుండు చేరుకొని విచారించగా ఆ బాలిక చెప్పింది నిజమేనని, 10 మంది బాలికల వివాహాలు ఈ ఏడాది ఏప్రిల్, మేలో జరగబోతున్నాయని స్పష్టమైంది. ఆ బాలికల పెళ్లిళ్లను రానున్న వేసవిలో చేయాలని నెల రోజుల క్రితం నిశ్చయించారు. ఆ బాలికలందరూ ఒకే మతానికి చెందిన వారు. వారంతా పేద కుటుంబాలకు చెందినవారే. భవిష్యత్తులో తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాల్సి వస్తే ఆ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారని అధికారులు తెలిపారు. అధికారుల జోక్యంతో ఆ పెళ్లిళ్లన్నీ రద్దయ్యాయి.