: మాటల తూటాలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అఖిలేష్ భార్య డింపుల్!
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన తరుణంలో ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్, తన మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. ఆమె తన ప్రచార సభల్లో పాటలు పాడుతూ, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలపై విమర్శలు గుప్పిస్తుంటే, సభలకు హాజరైన ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. నేడు ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె, నరేంద్ర మోదీ పాలన అవకతవకలమయమని దుమ్మెత్తి పోశారు. ఎస్పీ ప్రభుత్వం మనసు పెట్టి పనిచేస్తోందని కితాబిస్తూ, నెలనెలా 'మన్ కీ బాత్' అంటూ వచ్చే ప్రధాని, 'కామ్ కీ బాత్' (ఉపాధి గురించిన మాటలు) గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. యూపీ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతయినా చేస్తుందని తెలిపారు.
సమాజ్ వాదీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి తాజాగా రాజకీయాల్లోకి వచ్చి, యూపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆమె, ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ ముందు నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. తన ప్రసంగాల్లో కొత్త కొత్త నిర్వచనాలు చెబుతూ, ఇప్పటివరకూ 21 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. తమ తరఫున డింపుల్ తో ప్రచారం చేయించుకునేందుకు సమాజ్ వాదీ అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల సభలకు ప్రజలు స్వచ్ఛందంగా రావాలంటే, సినీ గ్లామర్ ఉండాలన్న వాదన తప్పని ఆమె నిరూపించిందని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు. డింపుల్ ప్రచారానికి వస్తే, విజయం ఖాయమన్న భావనలో ఉన్న ఎస్పీ శ్రేణులు, ఆమెతో మరిన్ని సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.