: విస్తుపోయే పచ్చి నిజం... రూపాయి కన్నా తక్కువ ధరకే మీ సమస్త సమాచారాన్నీ అమ్మేస్తున్న డేటా బ్రోకర్లు
మీకు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డుంది? ఎక్కడెక్కడ ఎంత అప్పు తీసుకున్నారు? ఫోన్ నంబర్ ఎంత? ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఎవరెవరు స్నేహితులుగా ఉన్నారు? వివాహమైందా? ఆదాయం ఎంత? ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఈ - మెయిల్ ఐడీ ఏంటి? చిరునామా ఎక్కడ? వంటి సమస్త సమాచారాన్ని డేటా బ్రోకర్లు రూపాయి కన్నా తక్కువ మొత్తానికే అమ్మేస్తున్నారని మీకు తెలుసా? ఇది విస్తుపోయే పచ్చి నిజం!
ధనవంతులు, వేతన జీవులు, క్రెడిట్ కార్డుదారులు, కారు యజమానులు, పదవీ విరమణ చేసిన వాళ్లు... ఇలా ఏదైనా కంపెనీ కోరుకున్న విభాగపు వ్యక్తుల వివరాలను నగరాల వారీగా డేటా బ్రోకర్లు విక్రయానికి ఉంచుతున్నారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లోని లక్ష మంది ప్రజల పూర్తి డేటాను ఎక్సెల్ రూపంలో అందించేందుకు కేవలం రూ. 10 నుంచి రూ. 15 వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు.
ఇక మరికొంత మంది బ్రోకర్లు, వివిధ కంపెనీలకు శాంపిల్ డేటాను కూడా పంపుతూ, తమ వద్ద ఎటువంటి వివరాలు ఉన్నాయో చూపిస్తున్నారు. ఓ న్యూస్ ఏజన్సీ కొందరు డేటా బ్రోకర్లను సంప్రదించి, వారిచ్చిన వివరాలను సరిపోల్చుకునేందుకు ఫోన్ కాల్స్ చేయగా, అవన్నీ నిజమేనని తేలింది. హైదరాబాద్ కు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి, పేరు, చిరునామా, క్రెడిట్ కార్డు వివరాలు తదితరాలను గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న డేటా బ్రోకర్ వద్ద న్యూస్ ఏజన్సీకి లభించాయి. అంతే కాదు, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులను తీసుకున్న 3 వేల మంది వ్యక్తుల వివరాలను సదరు బ్రోకర్ శాంపిల్ గా కేవలం రూ. 1000కే అందించాడు. తన వద్ద ఢిల్లీకి చెందిన 1.70 లక్షల మంది వివరాలున్నాయని, వాటిని కేవలం రూ. 7 వేలకే ఇస్తానని అతను చెప్పాడని న్యూస్ ఏజన్సీ వెల్లడించింది.
ఈబే ద్వారా గ్యాస్ స్టవ్ కొనుగోలు చేసిన బెంగళూరు వ్యక్తి బీకే నాగరాజ్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఇది నేరమేనని, తన అనుమతి లేకుండా తనకు చెందిన సమాచారాన్ని మరో వ్యక్తి ఎలా అమ్మకానికి పెడతారని, ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారానే డేటా చోరీ జరుగుతోందని ఆరోపించారు. అమేజాన్ నుంచి లగేజీని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కార్డు తీసుకున్న వారి వివరాలన్నీ సరిపోల్చుకుని చూశామని సదరు న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. ఇక డేటా లీక్ విషయమై, తమకు ఎటువంటి సంబంధం లేదని, అసలీ విషయమే తమకు తెలియదని అమెజాన్ వెల్లడించగా, డేటా సెక్యూరిటీ, కస్టమర్ల ప్రైవసీని కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈబే పేర్కొనడం గమనార్హం.