: విద్యార్థినిపై అత్యాచారం చేసిన పాస్టర్!
సమాజానికి మంచిని, నీతిని బోధించాల్సిన పాస్టర్... సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు. ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిపి, ఆమెను తల్లిని చేశాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సదరు పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, గత వారం ఓ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 25వ తేదీన చైల్డ్ లైన్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో, వాళ్లు అదే రోజున పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి వద్దకు వచ్చిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తొలుత తనపై అత్యాచారం చేసింది తన తండ్రే అని ఆ అమ్మాయి చెప్పింది. దీంతో, ఆమె తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది.
విద్యార్థినిపై అత్యాచారం చేసిన పాస్టర్... ఆమె చదువుతున్న పాఠశాలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 2016 మే నెలలో ఆమెపై పాస్టర్ అత్యాచారం చేశాడు. మరోవైపు, తన విషయం పోలీసులకు తెలిసిపోయిందనే విషయం తెలుసుకుని... సదరు పాస్టర్ పరారయ్యాడు. దీంతో, అతడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగి, చివరకు అతడిని అరెస్ట్ చేసింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.