: భోజనం వడ్డించడం లేటయిందని.. చెంప ఛెళ్లుమనిపించిన ఎమ్మెల్యే!
భోజనం వడ్డించడం 20 నిమిషాలు ఆలస్యమయిందనే కారణంతో, క్యాంటిన్ లో పని చేస్తున్న ఓ సర్వర్ చెంపను ఛెళ్లుమనిపించాడో ఎమ్మెల్యే. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కొట్టాయం జిల్లా పూంజర్ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ (65) తన కార్యాలయంలో ఉన్నారు. తనకు భోజనం కావాలని మధ్యాహ్నం 1.30కి చెప్పారు. 2.05 దాటినా భోజనం రాలేదు. దీంతో, క్యాంటీన్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మహిళను పిలిచి అడిగారు. కుర్రాడిని పంపానని ఆమె బదులిచ్చారు. ఇదే సమయంలో సదరు కుర్రాడు భోజనం తీసుకుని అక్కడకు వచ్చాడు. ఈ సమయంలో ఆ కుర్రాడిపై జార్జ్ తిట్ల పురాణం ఎత్తుకున్నారు. తిట్టాల్సిన అవసరం లేదని ఆ కుర్రాడు అనగా... చెంప ఛెళ్లుమనిపించారు.
ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే అనవసరంగా తనను కొట్టారంటూ ఆ కుర్రాడు మీడియా ముందు వాపోయాడు. అయితే, ఘటనపై మాత్రం ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. దీనిపై స్పందించిన జార్జ్... తాను ఆ కుర్రాడిని తిట్టి పంపించానే తప్ప కొట్టలేదని చెప్పారు. తన పేరును అనవసరంగా ఇరికించినందుకు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.