: దివాకర్ ట్రావెల్స్ నిర్వాకం... డిక్కీలో ప్రయాణికుడు... తీవ్రగాయాలతో చావుబతుకుల్లో వున్నాడు!
ఆదాయ సముపార్జనే పరమావధిగా ప్రైవేటు ట్రావెల్స్ ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయో మరోసారి తేటతెల్లమైంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ బస్సు ఒకటి గత రాత్రి కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురికాగా, ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ బస్సులో డిక్కీలో సైతం ఓ వ్యక్తి ప్రయాణిస్తుండటం గమనార్హం. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు పూర్తిగా నిండిపోవడంతో అతన్ని డిక్కీలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డిక్కీలోని వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. అతన్ని విశాఖవాసిగా గుర్తించారు. డిక్కీలో ప్రయాణికుడు ఉన్న ఘటనపై మరో కేసును నమోదు చేయనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్న వైద్య మంత్రి కామినేని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.