: ఇది రికార్డే.. ఆస్కార్ అవార్డు కోసం 21 సార్లు నామినేట్ అయ్యాడు.. చివరిగా ఈ రోజు కొట్టేశాడు!
ప్రతి నటీనటుడు, టెక్నీషియన్ అందుకోవాలని కోరుకునే అవార్డు ‘ఆస్కార్’. తమలోని ప్రతిభనంతా కనబరచి ఆ అవార్డు అందుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఆ అవార్డు అందుకునే అవకాశం మాత్రం కొంత మందికి మాత్రమే వస్తుంది. ఎంతో మంది నటులు, టెక్నీషియన్స్ కనీసం నామినేట్ కూడా కాలేకపోతారు. అయితే, హాలీవుడ్ సినిమాలకు సౌండ్ మిక్సింగ్‌లో సేవలందించే కెవిన్ ఓ కనెల్ మాత్రం ఇప్పటికి 21 సార్లు ఆ అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. అందులో ఇరవై సార్లు ఆ అవార్డును అందుకోకుండానే వెనుదిరిగిన కెవిన్... ఈ రోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్‌ను సాధించేశాడు. 21వ సారి నామినేట్ అయిన తాను ఆ అవార్డును గెలుచుకోవడం పట్ల పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘హక్సా రిడ్జ్’ సినిమాకుగాను ఆయన ‘ఉత్తమ సౌండ్ మిక్సింగ్’ అవార్డును అందుకున్నాడు. ఆయన మొదటి సారిగా ఆస్కార్ అవార్డు కోసం 1983లో నామినేట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 34 ఏళ్లుగా నామినేట్ అవుతూనే ఉన్నాడు. చివరిగా ఆ అవార్డును సొంతం చేసుకొనే ఇంటికి తిరిగి వెళ్లాడు.