: ఆస్కార్ ఉత్తమ చిత్రాన్ని తప్పుగా ప్రకటించడంపై వివరణ ఇచ్చి.. సారీ చెప్పిన పీడ‌బ్ల్యూసీ


లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ రోజు 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో పొర‌పాటు జ‌రిగిన విష‌యం తెలిసిందే. కార్య‌క్ర‌మం చివ‌ర్లో ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించే క్ర‌మంలో వేదిక‌పైకి వ‌చ్చిన ఫాయే డునావే, వారెన్ బీటీ ఉత్తమ చిత్రం ‘లా లా ల్యాండ్’ అని ప్రకటించారు. ఆ త‌రువాత ఉత్త‌మ చిత్రం ‘లా లా ల్యాండ్’ కాద‌ని 'మూన్‌లైట్' అని నిర్వాహకులు త‌ప్పుదిద్దుకున్నారు. ఈ అంశంపై ప్రైస్‌వాటర్‌హౌజ్ కూప‌ర్స్ క్ష‌మాప‌ణ చెప్పింది. తాము చేసిన పొర‌పాటుకు లా లా లాండ్‌, మూన్‌లైట్ సినిమాల టీమ్స్‌తో పాటు వేదిక‌పై తాము అందించిన క‌వ‌రు ఆధారంగా అవార్డు ప్ర‌క‌టించిన వారెన్ బీటీ, ఫాయ్ డ‌న‌వేల‌ను క్ష‌మాప‌ణలు కోరుతున్న‌ట్లు తెలిపింది.

త‌ప్పుడు ఎన్‌వ‌ల‌ప్‌ను అందించడం వ‌ల్ల ఈ పొర‌పాటు జ‌రిగింద‌ని, ఈ పొర‌పాటు ఎలా జ‌రిగింద‌న్న‌ దానిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొంది. వేదిక‌పై ఈ పొర‌పాటును హుందాగా ఎదుర్కొన్న ఆ రెండు సినిమా టీమ్‌ల‌కు, అకాడ‌మీ అవార్డు నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పింది. కాగా, ఆస్కార్ ఉత్త‌మ చిత్రాన్ని త‌ప్పుగా ప్ర‌క‌టించ‌డంపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News