: వాతావరణం బాగుందని బీరు తాగడానికి వెళ్లాం... ఆపై ఇదంతా జరిగింది!: బీబీసీ ఇంటర్వ్యూలో అలోక్
"కాల్పులు జరిగిన రోజు వాతావరణం చాలా బాగుంది. రోజూ పని ముగించుకుని ఇంటికి వెళ్లేవాళ్లం. ఆ రోజు మాత్రం సరదాగా బీర్ తాగుదామని అనుకున్నాం. వ్యక్తిగత, ఉద్యోగ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. హఠాత్తుగా ఒకతను (కాల్పులు జరిపిన వ్యక్తి) మా దగ్గరికి వచ్చి వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. అతని ప్రవర్తన, మాటతీరు చూసి ఏదో ప్రమాదం జరుగుతుందని ఊహించాం. మీరు ఏ దేశం నుంచి వచ్చారని అడిగాడు. మీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారా? అని ప్రశ్నించాడు.
నేను వెంటనే మేనేజర్ రూమ్ కు వెళ్లాను. అప్పుడు కొందరు అమెరికన్స్ అతన్ని అడ్డుకున్నారు. అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. బయటికి వెళ్లిన అతను తిరిగి గన్ తో వచ్చాడు. అప్పుడు మేం బీరు తాగుతున్నాం. వెంటనే కాల్చాడు. నేను నేలపై పడిపోయాను. సాయం చేయండని అరిచాను. కొంచెం తిరిగి శ్రీనివాస్ ను చూసేసరికి కదలికలు లేకుండా పడి ఉన్నాడు. ఆ సమయంలో బ్రాడ్ అనే వ్యక్తి వచ్చి తన చొక్కా విప్పి, నా కాళ్లకు గట్టిగా కట్టాడు. అతనే నా ప్రాణాలు కాపాడాడు" అని కాల్పుల ఉదంతంపై అలోక్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఇది తప్పకుండా భయానకమైన పరిస్థితే. నేను చాలా భయపడ్డాను. ఇది స్పష్టంగా విద్వేషమే. అమెరికాలో కొందరు అనూహ్యంగా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మేము ఇక్కడే పెరిగాం. కాన్సస్ వస్తున్నప్పుడు చాలా సంతోషించేవాళ్లం. ఇది చాలా మంచి ప్రాంతం. హింస, విద్వేషం ఉంటాయన్న ఊహ కూడా మా మనసుల్లో లేదు" అని కాల్పుల్లో గాయపడి, ప్రాణాపాయం నుంచి కోలుకున్న అలోక్ వెల్లడించారు.