: కొత్త అసెంబ్లీ భవన ప్రాంగణంలో అడుగుపెట్టిన సిబ్బంది
అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలోకి ఈ రోజు సిబ్బంది అడుగుపెట్టారు. సిబ్బందితో పాటు సభాపతి కోడెల శివప్రసాద్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. వచ్చేనెల 6 నుంచి అమరావతిలో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సిబ్బందికి కోడెల, యనమల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ సొంతగడ్డపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడం శుభపరిణామమని, అసెంబ్లీలో అన్ని పక్షాలు అర్థవంతమైన చర్చ జరిగేలా సహకరించాలని వ్యాఖ్యానించారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. వచ్చేనెల 13న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక్కడ ఇంకా వసతి కల్పించనందున వారందరికీ భత్యం రూపంలో అదనంగా రూ.50వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.