: స్పీకర్ కోడెలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీలో త్వరలోనే సమావేశాలు నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని అసెంబ్లీని ఖాళీ చేసి, రెండో దొంగసొత్తుతో కొత్త అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా? అని ఆయన అందులో ప్రశ్నించారు. చంద్రబాబు వీడియో సాక్ష్యాలతో దొరికిపోవడం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియను వేగంగా పూర్తి చేశారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ కండువాలు కప్పారని, వాళ్లంతా కూడా దొంగసొత్తే అవుతారని జగన్ లేఖలో పేర్కొన్నారు. సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము ఎప్పుడో అడిగామని, అయినప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జగన్ పేర్కొన్నారు. స్పీకర్ కోడెల రాజ్యాంగానికి, ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు జగన్ లేఖలో చెప్పారు.