: మరణించే ముందు నరకయాతన: నామ్ మరణంపై మలేషియా
మలేషియాలో విషప్రయోగం తరువాత మరణించిన కిమ్ జాంగ్ నామ్, 20 నిమిషాల పాటు నరకయాతనను అనుభవించారని మలేషియా ఆరోగ్య మంత్రి ఎస్ సుబ్రమణియన్ ప్రకటించారు. వీఎక్స్ పేరున్న అత్యంత ప్రమాదకర విష రసాయనాన్ని ఆయనపై ప్రయోగించగా, ఆపై 20 నిమిషాల్లో ఆయన మరణించారని, ఇది అత్యంత బాధాకరమైన మరణమని ఆయన అన్నారు. బాధతో విలవిల్లాడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగానే, ఆంబులెన్స్ లోనే ప్రాణాలు పోయాయని తెలిపారు. దాడి జరిగిన తరువాత 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని, మరణానికి కారణం అత్యంత తీవ్రమైన విషమేనని పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. కేవలం 10 మిల్లీ గ్రాముల వీఎక్స్ ప్రాణాలను తీయగలుగుతుందని తెలిపారు.