: 'రిసార్టులో ఉంటావా?' అంటూ ఎమ్మెల్యేను నిర్బంధించిన తమిళ తంబీలు
శశికళ వర్గంలో కొనసాగిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు కొనసాగుతున్నాయి. ప్రజలు పలు సమస్యల్లో ఉంటే వాటిని పట్టించుకోకుండా, రిసార్టుల్లో గడిపి రావడం భావ్యమేనా? అంటూ, తిరుప్పూరు (ఉత్తర) నియోజకవర్గ ఎమ్మెల్యే విజయకుమార్ ను నియోజకవర్గ ప్రజలు నిర్బంధించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఆనందనను కూడా అటకాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దివంగత జయలలిత పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి బయలుదేరిన వీరిని చొక్కనూరు సమీపంలో అడ్డుకున్న స్థానిక ప్రజలు తమ నిరసన తెలిపారు. దీంతో ఇద్దరు నేతలూ తీవ్ర ఆందోళనకు గురైనట్టు సమాచారం. ఆపై విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ విడిపించి, అక్కడి నుంచి పంపించారు.