: చంద్రబాబు తక్షణ లక్ష్యాలివి!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా తక్షణం చేపట్టాల్సిన కార్యక్రమాలు, లక్ష్య సాధన కోసం అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ఉదయం 'నీరు - ప్రగతి'పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, అధికారులతో మాట్లాడిన బాబు, వేసవి సమీపించినందున ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేయాలని సూచించారు. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. మరో ఏడాదిలోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఆపై ప్రకాశం జిల్లాకు నీటి సమస్య ఉండదని అన్నారు. అందరికీ నీటిని అందించాల్సిన బాధ్యత జల వనరుల శాఖదేనని స్పష్టం చేశారు. ఆ శాఖకు ఇవ్వాల్సిన రూ. 300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

గత వారంలో 10,445 పంట కుంటల తవ్వకం పూర్తయిందని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,929 పంట కుంటలు సిద్ధమయ్యాయని తెలిపారు. వేసవి ముగిసేలోగా, మరో ఒకటిన్నర లక్షల పంట కుంటల తవ్వకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 700 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రహదారులు నిర్మించాల్సి వుందని, ఈ లక్ష్యాన్ని కూడా వేసవిలోనే అందుకోవాలని తెలిపారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా తాగునీటిని అందుబాటులో ఉంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడ్డ ఆయన, పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదని చెప్పారు. మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల నిర్మాణాల బకాయి నిధులు వెంటనే విడుదల చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News