: ఇకపై సీఎం నోటి 'మాట' ఖాతరు చేయం.. లిఖిత పూర్వక ఆదేశాలనే అమలు చేస్తాం!: బీహార్ అధికారుల సంచలన నిర్ణయం
బీహారులో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సదరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ సుధీర్ కుమార్ ను అరెస్ట్ చేసిన విషయమై, సమావేశమైన బ్యూరోక్రాట్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాట్నాలో సమావేశమైన ఐఏఎస్ అధికారులు, ఇకపై ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా నోటి మాటగా చెప్పిన ఏ ఆదేశాలనూ పాటించరాదని, లిఖిత పూర్వకంగా చేతికి వచ్చిన ఆదేశాలనే అమలు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ నియామకాల బోర్డులకు చైర్మన్లుగా ఏ ఐఏఎస్ అధికారీ ఉండరాదని నిర్ణయించారు.
ఎవరో చేసిన కుట్రలో సుధీర్ ఇరుక్కున్నాడని, ఆయన న్యాయ పోరాట ఖర్చులను అధికారుల సంఘం భరిస్తుందని తెలిపారు. సుధీర్ అరెస్టు అన్యాయమని, బీహార్ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ఐఏఎస్ అధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్ రామ్ నాథ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా, సుధీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, తన బంధువుల కోసం ఆయన ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నా జైలులో ఉండగా, ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో ఇంతవరకూ 36 మంది అరెస్ట్ అయ్యారు.