: హర్భజన్ సింగ్ ట్వీట్ ని గుర్తు చేస్తూ చురకలంటించిన డేవిడ్‌వార్నర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పూణే వేదికగా జరిగిన తొలిటెస్టు మ్యాచులో టీమిండియా ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. సొంత గడ్డపై తిరుగులేని విజయాలు నమోదు చేసుకున్న భారతే ఈ సిరీస్ లో ఫేవరేట్ అని అందరూ భావించారు. అయితే, ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 333 పరుగులతో ఓటమిపాలయింది. అయితే, తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్ భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభవం తప్పదని, ఆస్ట్రేలియాని ఓ చెత్తటీమ్ అని వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు టీమిండియానే ఘోరంగా ఓటమిపాలవడంతో ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఆయనకు చురకలంటించాడు. ఆనాడు హర్భజన్ సింగ్ అన్న మాటలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా గుర్తు చేశాడు. ఆనాడు హర్భజన్ చేసిన ట్వీటుకి రీట్వీటు చేస్తూ తాము బాగానే ఆడామని అన్నాడు. అయితే, తొలి మ్యాచ్ ముగిసిన తరువాత హర్భజన్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ప్రతీ బంతికి కష్టపడాల్సిన పిచ్‌పై అద్భుతంగా రాణించారని అన్నాడు.