: సమస్య వచ్చిన ప్రతిసారీ హార్ట్ ఎటాక్ రాదు.. నేను చనిపోను: ఏడేళ్ల అనుభవాలని పంచుకున్న సమంత
చెన్నై బ్యూటీ సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఈ రోజుకి సరిగ్గా ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ అమ్మడు తన ఏడేళ్ల అనుభవాలను తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 2010లో ఫిబ్రవరి 26న విడుదలైన 'ఏం మాయ చేశావే'లో ఆమె అక్కినేని నాగచైతన్య సరసన కనిపించిన విషయం తెలిసిందే. అనంతరం కొద్ది కాలంలోనే దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఏడేళ్లలో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది. కష్టాలు, అపజయాలు, విచారం, సక్సెస్, మంచి పేరు రావడం, సంపద ఇలా ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది.
సంతోషంగా జీవించడం అనేది అంత సామాన్యమైన విషయమేం కాదని పేర్కొన్న సమంత... సాధారణంగా జీవించడం ఎలాగో తనకు ఈ ఏడేళ్ల కాలంలోనే తెలిసిందని తెలిపింది. సమస్య వచ్చిన ప్రతిసారీ తనకు హార్ట్ ఎటాక్ రాదని, తాను చనిపోనని ఈ భామ పేర్కొనడం విశేషం. సినీ జీవితం తన వ్యక్తిగత జీవితంలోకి కొందరిని పరిచయం చేసిందని ఆ అమ్మడు తెలిపింది.
తనకు సినీ జీవితం ఒక వరం అని చెప్పింది. సినీ పరిశ్రమ ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమను తనకు ఇచ్చిందని తెలిపింది. చివరగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు, తన అభిమానులను ఎప్పటికీ ప్రేమిస్తుంటానని పేర్కొంది.
#7yearsofYMC pic.twitter.com/QOQEYcKfQI
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 26 February 2017