: డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్: వైట్‌హౌస్‌ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లింలపై క‌న‌బ‌రుస్తోన్న తీరుకి నిర‌స‌న‌గా వైట్‌హౌస్‌ ఉద్యోగిని రుమానా అహ్మద్ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్న ఆ ముస్లిం మహిళ ఒబామా హయాంలో 2011లో వైట్‌హౌస్‌లోని  నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇన్నాళ్లు అందులోనే ప‌నిచేసిన ఆమె..  ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన ఎనిమిదో రోజు త‌న ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తాను త‌న‌ అత్యున్నత విధానాల రక్షణకు కృషి చేస్తానని అన్నారు. తాను ఈ టీమ్ లో హజీబ్‌ ధరించే ఏకైక మహిళనని చెప్పారు.

ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు ఒబామా కార్యవర్గం త‌న‌ను వారిలో కలుపుకొని పోయారని, కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక త‌మ‌ను అనుమానంగా చూస్తున్నారని రుమానా అహ్మద్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు. ట్రంప్ ఏడు ముస్లిందేశాల‌పై నిషేధం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేసిన త‌రువాత కూడా ఎనిమిది రోజులు ప‌నిచేశాన‌ని అన్నారు.

తాను రాజీనామా చేస్తున్నాన‌ని ట్రంప్‌ సీనియర్‌ నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌ మిచెల్‌ ఆంటోన్‌కు సమాచారం అందజేశానని, అయితే తొలుత ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. త‌న‌ను ప్ర‌భుత్వం నుంచి వైదొలగుతున్నావా? అని మాత్ర‌మే ఆయన అడిగారని చెప్పారు. ఆ అధికారి క‌నీసం త‌న‌ను ఎందుకు రాజీనామా చేస్తున్నావ‌ని కూడా అడ‌గ‌లేద‌ని చెప్పారు. తాను ఎంతో అవమాన భారంతో వైట్ హౌస్ నుంచి వ‌చ్చేశాన‌ని చెప్పారు. తాను ఆ దేశంలో ఒక అమెరికన్‌గా, ఒక ముస్లింగా ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News