: ఇండియాలో అత్యంత ధనిక నగరాల జాబితా ఇదిగో!


భారత్ కు ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహానగరం, దేశంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా నిలిచింది. 'న్యూ వరల్డ్ వెల్త్' సంస్థ ఇండియాలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేయగా, 46 వేల మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ముంబై ప్రజల సంయుక్త ఆస్తుల విలువ 820 బిలియన్ డాలర్లని నివేదిక పేర్కొంది.

ఇక 23 వేల మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లతో, మొత్తం 450 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఆపై 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు, 320 బిలియన్ డాలర్ల ఆస్తులతో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా, 9 వేల మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ ప్రజల ఆస్తుల విలువ 310 బిలియన్ డాలర్లని 'న్యూ వరల్డ్ వెల్త్' ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరులోని మిలియనీర్లతో పోలిస్తే, 1,300 మంది అధిక మిలియనీర్లు నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ లో ఉండటం గమనార్హం.

ఈ జాబితాలో ఐదో స్థానంలో కోల్ కతా (9,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు, 290 బిలియన్ డాలర్ల ఆస్తి), ఆరో స్థానంలో పుణె (4,500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లు, 180 బిలియన్ డాలర్ల ఆస్తులు), ఏడో స్థానంలో చెన్నై (6,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు, 150 బిలియన్ డాలర్ల ఆస్తులు), ఎనిమిదో స్థానంలో గురుగ్రామ్ (4 వేల మంది మిలియనీర్లు, ఇద్దరు బిలియనీర్లు, 100 బిలియన్ డాలర్ల ఆస్తులు) ఉన్నాయి. ఆ తరువాత సూరత్, అహ్మదాబాద్, విశాఖపట్నం, గోవా, చండీగఢ్, జైపూర్, వడోదర నగరాలు నిలిచాయి.

డిసెంబర్ 2016 నాటికి ఇండియాలో మొత్తం 2.64 లక్షల మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారని, మొత్తం ఆస్తుల విలువ 6.2 ట్రిలియన్ డాలర్లని 'న్యూ వరల్డ్ వెల్త్' ప్రకటించింది. వచ్చే దశాబ్ద కాలంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకెళుతున్న హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాల్లో సంపన్నుల సంఖ్య భారీగా పెరగనుందని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News