: చంద్రబాబు మనసులో ఎవరున్నారో?... ఎమ్మెల్సీ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ!
శాసనమండలి ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో తలమునకలై ఉండగా, ఆశావహుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 స్థానాలకుగానూ అభ్యర్ధుల ఎంపిక కోసం చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమై చర్చిస్తుండగా, చివరికి ఎవరి పేర్లు బయటకు వస్తాయోనన్న టెన్షన్ కొనసాగుతోంది. సామాజిక సమీకరణలు, ఇతర ప్రాధాన్యతాంశాలపై చర్చలు సాగుతున్నాయని, ఆపై అభ్యర్థుల పేర్లు అధికారికంగా వెల్లడవుతాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్లను కోరుతున్న వారు విజయవాడలో మకాం వేసి చంద్రబాబు నోటి నుంచి తమ పేరును రప్పించుకునేందుకు తెలిసిన మంత్రులు, నేతలతో తుది వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. కాగా, నేటి సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ పడనున్న అభ్యర్థుల పేర్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి.