: నోట్ల రద్దు ప్రక్రియ ముగిసినట్టే... సవాలుని ఎదుర్కొని నిలిచాం!: అరుణ్ జైట్లీ
దాదాపు మూడున్నర నెలల క్రితం భారత ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దాదాపుగా ముగిసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ దేశమూ పెద్ద నోట్ల రద్దును ఇంత సున్నితంగా చేయలేదని ఆయన అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 'ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా: విజన్ ఫర్ నెక్ట్స్ డికేడ్' అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అధిక వృద్ధి రేటు, డిజిటలైజేషన్ లక్ష్యంగా డీమానిటైజేషన్ ను ప్రకటించామని, చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను వ్యవస్థ నుంచి తొలగించామని అన్నారు. నగదు వ్యవస్థను, డిజిటల్ ఎకానమీగా మార్చడంలో ఇది అత్యంత కీలక ఘట్టమని తెలిపారు. మరింత ఆదాయ సృష్టి, అభివృద్ధి దిశగా ఇండియా దూసుకుపోనుందని జైట్లీ అభివర్ణించారు. స్థూల జాతీయోత్పత్తి కొంతమేరకు తగ్గినట్టు కనిపించినా, అది తాత్కాలికమేనని, నోట్ల రద్దు తరువాత నెలకొన్న నగదు కొరత కూడా తీరిపోయిందని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న వేళ, చరిత్రను సృష్టించే దిశగా ఇండియా అడుగులు వేసిందని, ఇప్పుడా సవాలును ఎదుర్కొని నిలిచిందని అన్నారు. తిరిగి 8 శాతం వృద్ధి రేటును సాధించడంపై దృష్టిని నిలిపామని జైట్లీ వెల్లడించారు.