: జగన్ కేసులు ఏ కోర్టులోనూ నిలవవు, లక్ష్మీనారాయణకూ విషయం తెలుసు: ఏపీ మాజీ ఈసీ రమాకాంత్ రెడ్డి
రాష్ట్ర సచివాలయం, క్యాబినెట్ నిబంధనలను పట్టించుకోకుండా, కనీసం మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలుసుకోకుండా వైకాపా అధినేత వైఎస్ జగన్ పై పెట్టిన కేసులు నిలిచేవి కాదని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఎన్నికల కమిషనర్, ప్రధాన కార్యదర్శి, పి రమాకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రూల్స్ తెలుసుకోకుండానే అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విచారణను ప్రారంభించారని అన్నారు.
సెక్రటేరియట్ లో, క్యాంప్ ఆఫీసులో జరిగిన ఏ సమావేశాలకూ జగన్ హాజరు కాలేదని, తనకు పని చేసి పెట్టాలని ఎన్నడూ లేఖలు రాయలేదని అన్నారు. జగన్ పై విచారణ జరిగిన తీరును చూస్తే, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై ఎంతమాత్రమూ అవగాహన లేదని తనకు అర్థమైందని రమాకాంత్ రెడ్డి అన్నారు.
ఓ చానల్ కు, పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఫలానా కంపెనీకి పని చేసి పెట్టాలని జగన్ నుంచి తనకు ఎలాంటి వినతీ అందలేదని, తాను జగన్ ను వైఎస్ చనిపోయిన తరువాత మాత్రమే తొలిసారిగా కలిశానని అన్నారు. జగన్ కేసు నిలబడదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకూ తెలుసునని, తనను సీబీఐ విచారణకు పిలిచిన వేళ, సీబీఐ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పానని స్పష్టం చేశారు. ఈ కేసులు నిలుస్తాయా? అని తాను ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారని, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, కార్యదర్శులమైన తాము సంతకం పెట్టేటప్పుడు కారణాలు రాయక్కర్లేదన్న విషయ పరిజ్ఞానం కూడా లేకుండా తనను విచారణకు పిలిచారని ఆరోపించారు.