: 'లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమా విడుదలకు తీవ్ర కష్టాలు!
ప్రకాశ్ ఝా నిర్మించిన ఫెమినిస్ట్ ఫిల్మ్ ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’లో అభ్యంతరకర అశ్లీల దృశ్యాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ఈ విషయంపై సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహలజ్ నిహలానీ మాట్లాడుతూ... తాము సెన్సార్ బోర్డు నియమాలను పాటిస్తున్నామని అన్నారు. అశ్లీల చిత్రాలను తాను ఏమాత్రం సహించబోనని చెప్పారు.
ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలిగించిన తర్వాత విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపుతామని చెప్పారు. గతంలో ఎన్నో సినిమాలు అశ్లీల దృశ్యాల విషయంలో సెన్సార్ బోర్డు నుంచి తప్పించుకున్నాయని, కానీ ఈసారి మాత్రం అలా జరగదని స్పష్టం చేశారు. ఇటువంటి చిత్రాలకు అవినీతి వల్లే గతంలో సెన్సార్ బోర్డు నుంచి అనుమతి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం అలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని చెప్పారు.