: కాంగ్రెస్ నేతలని సన్నాసులు అనడం చాలా చిన్న మాట: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నేతలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసులు అంటూ నిన్న విమర్శించిన సంగతి విదితమే. అయితే, ఈ మాట చాలా చిన్న మాట అని తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఈ రోజు సమర్థిస్తూ మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు రాజకీయ పార్టీ సభ్యుల్లా కాకుండా ఓ దొంగల ముఠాలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు కట్టి చూపిస్తామని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నేతలు దోపిడీదారులు, సన్నాసులు కాకపోతే ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించకుండా అవినీతి అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి జరగకుండా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆస్తులను దోచుకున్నారని, ఇప్పుడు కూడా అభివృద్ధి జరగకుండా కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు. తాము చేసే అభివృద్ధి పనులు కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.