: రూ. 47.19 కోట్ల విపత్తు నివారణ సొమ్ము కోహ్లీకి చెల్లింపు.. సర్వత్రా విమర్శలు


ఇంతకంటే దారుణం, ఘోరం మరొకటి ఉండదు. విపత్తు నివారణ కోసం, తదనంతర చర్యల కోసం కేటాయించిన నిధులను సెలబ్రిటీల ఎండార్స్ మెంట్లకు చెల్లించిన వార్త విని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, విపత్తు నివారణ నిధుల నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 47.19 కోట్లు చెల్లించింది. బీజేపీకి చెందిన నాయకుడు అజయ్ రాజేంద్ర సమాచారహక్కు చట్టం ప్రకారం వివరణ కోరగా ..  ప్రభుత్వం ఈ వివరాలను బహిర్గతం చేసింది.

రుద్రప్రయాగ జిల్లా విపత్తు నివారణ సంస్థకు కేటాయించిన నిధుల నుంచి ఈ సొమ్మును 2015 జూలైలో కోహ్లీకి చెల్లించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరాఖండ్ టూరిజంను ప్రమోట్ చేేసినందుకు కోహ్లీకి ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపింది. వరద బీభత్సంతో విధ్వంసమైన రుద్రప్రయాగ జిల్లా పునర్నిర్మాణం కోసం ఈ నిధులను కేటాయించారు.

వాస్తవానికి వివిధ ఎండార్స్ మెంట్లలో భాగంగా సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఇవ్వడం సాధారణమైన అంశమే. అయితే, వరద అనంతరం పునర్నిర్మాణ చర్యల కోసం కేటాయించిన నిధులను కోహ్లీకి చెల్లించడం... సర్వత్రా విమర్శలపాలు అవుతోంది. టూరిజంను ప్రమోట్ చేసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన గంట నిడివి ఉన్న వీడియోలో విరాట్ కోహ్లీ కనిపిస్తాడు.

ఈ అంశంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సలహాదారు సురేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పారు. భక్తుల కేదార్ నాథ్ యాత్రను విజయవంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.  

  • Loading...

More Telugu News