: బాహుబలి-2 ట్రైలర్ తేదీ ప్రకటించడానికి చిన్న ఇబ్బంది ఉంది: రాజమౌళి
‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలిపారు. బాహుబలి-2 థియేట్రికల్ ట్రైలర్ తేదీ ప్రకటించడానికి చిన్న ఇబ్బంది ఉందని చెప్పారు. ట్రైలర్ కటింగ్ అయిపోయిందని, అయితే దాని తాలూకూ సీజీ షాట్లు రావాలని చెప్పారు. అనంతరం సౌండ్ క్రియేట్ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు.
ఒకవేళ తాము ట్రైలర్ తేదీ చెప్పేస్తే, అదే డేట్‌కి కచ్చితంగా విడుదల చేయాల్సి ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్ స్టూడియో వాళ్లు కూడా అదే డేట్‌కి ఇస్తారని, మరోపక్క అభిమానులు కూడా తొందర పెడుతుంటారని, దాంతో క్వాలిటీ మిస్సయ్యే ప్రమాదముందని ఆయన అన్నారు. దీంతో ట్రైలర్ విడుదల అయ్యే తేదీ ప్రకటించడం కష్టమని అన్నారు. తాము ట్రైలర్‌ను మార్చి నెలమధ్యలో తప్పకుండా తీసుకొస్తామని చెప్పారు.
బాహుబలి సినిమా తీయడానికి ఏ కథైతే మొదలుపెట్టామో ఆ కథ బాహుబలి 2తో పూర్తయిపోతుందని రాజమౌళి చెప్పారు. అయితే, సినిమాకి ముగింపు ఇచ్చేసి ఆ సినిమాలోని పాత్రలను టీవీ సీరీస్‌గానో, యానిమేషన్‌గానో, కామిక్స్ గానో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.