: ప్రధాని వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఒడిశా శాసనసభ!
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన వ్యాఖ్యలు ఒడిశా అసెంబ్లీని పట్టికుదిపేశాయి. దేశంలో పేద జిల్లాలు ఎక్కడున్నాయా? అని చూస్తే ఒడిశాలో కనిపిస్తాయని, అలాంటి ఒడిశాలో స్థానిక ఎన్నికల్లో పేద ప్రజలు తమకు మద్దతు పలికారని ఆయన యూపీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. పెద్దనోట్లు రద్దు చేసినా తమ పట్ల వ్యతిరేకత లేదని ఆయన చెప్పారు. దానికి నిదర్శనమే నిరుపేద ఒడిశాలో బీజేపీ విజయమని ఆయన చెప్పారు.
కాగా, దీనిపై ఒడిశా అసెంబ్లీలో బీజూ జనతాదళ్ (బీజేడీ), కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తను చేసిన వ్యాఖ్యల పట్ల తక్షణం ఒడిశా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని వాయిదా వేశారు. అనంతరం అంతా కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.