: సినీ నటుడైన శశికళ వర్గం ఎమ్మెల్యేకి నియోజక వర్గంలో చేదు అనుభవం!
తమిళనాడులో శశికళ వర్గానికి మద్దతిచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే, హాస్యనటుడు కరుణాస్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జయలలిత మరణానంతరం తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజా మద్దతు పన్నీరు సెల్వంకు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ శిబిరంలో చేరిన కరుణాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే చాలని, ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన చేసిన ఆ వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో భారీ ప్రచారం పొందింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆయనకు సొంత నియోజకవర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
ఈ నేపధ్యంలో ఆయన గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేసి, తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన తిరువాడనైలోని ఓ బస్టాండుకు వెళ్లారు. దీంతో ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న స్థానికులు, ఆయనను చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి, ఆయనను అక్కడి నుంచి తరలించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన స్థానికులు ఇంకోసారి ఈ నియోజకవర్గంలోకి రావద్దని, వస్తే తిరిగి వెళ్లవంటూ హెచ్చరించారు.