: డాక్టర్ గా మారిన మిజోరం ఎమ్మెల్యే.. ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించిన వైనం!
ఎమ్మెల్యేగా అనుచరులతో సభలు, సమావేశాలకు హడావుడిగా తిరిగే ఆయన హఠాత్తుగా డాక్టర్ అవతారం ఎత్తి ఆపరేషన్ నిర్వహించిన ఘటన మిజోరంలో చోటుచేసుకుంది. సైహా జిల్లా ఆసుపత్రిలో ఉన్న శస్త్రచికిత్స నిపుణుడు ఇంఫాల్ లోని శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లగా, కడుపునొప్పితో బాధపడుతున్న మహిళ ఆసుపత్రికికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని తెలియడంతో రంగంలోకి దిగిన 52 ఏళ్ల ఎమ్మెల్యే డాక్టర్ బీచువా ఆపరేషన్ నిర్వహించారు.
డాక్టర్ బీచువా ఇంఫాల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 20 సంవత్సరాలపాటు వైద్య వృత్తి కొనసాగించిన ఆయన, వైద్యుడిగా వందలాది శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆయన భార్య కూడా వైద్యురాలే కావడం విశేషం. 2008లో రాజకీయాల్లో ప్రవేశించిన బీచువా, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) పార్టీలో చేరి 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆపరేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ, 2013 డిసెంబరులో చివరిసారిగా ఆపరేషన్ చేశానని, మూడేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు అనుకోకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, ఆమె కోలుకుంటోందని తెలిపారు.