: కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారు: రష్యా పరిశోధకుల బృందం
మహాశివుడు కొలువుంటాడని హిందువులు భావించే కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈఆర్.ముల్దేశేవా అధ్వర్యంలోని పరిశోధకుల బృందం చెబుతోంది. ఆయన తన బృందంతో 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద విశేషమైన పరిశోధనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి కైలాస పర్వతం పిరమిడ్ ఆకారంలో మానవులు నిర్మించిన అత్యద్భుత భారీ కట్టడమని చెప్పారు. కేవలం కైలాస పర్వతం మాత్రమే కాదని, దాని చుట్టూ వందకు పైగా పిరమిడ్ ఆకృతులు కూడా ఉన్నాయని, వాటిని కూడా మానవులే నిర్మించారని ఆ బృందం చెబుతోంది.
అయితే ఈ పిరమిడ్లను మన కన్నా ఎంతో అడ్వాన్స్ గా ఉన్నవాళ్లు నిర్మించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే కైలాస పర్వతాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టూ ఓ పద్ధతి ప్రకారం వందకు పైగా పిరమిడ్లను నిర్మించారని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన వాదనను చైనా శాస్త్రవేత్తలు, భారతీయ ఆధ్యాత్మికవేత్తలు ఖండిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించడం లేదని చెప్పారు. ఇది సహజంగా ఏర్పడిన పర్వతమని చైనా శాస్త్రవేత్తలు చెబుతుండగా, దేవుని లీల అని భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. అయితే రష్యా పరిశోధకుడు ముల్దేశేవా ప్రతిపాదించినట్టు ఈ పర్వతం మానవ నిర్మిత కట్టడమైతే కనుక భూమి మీద మానవులు నిర్మించిన భారీ కట్టడం కైలాస పర్వతమే అవుతుంది.