: బ్యాటింగ్ లో అలా... ఫీల్డింగ్ లో ఇలా... టీమిండియన్ల తీరిది!
పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు నమోదు చేస్తోంది. తొలుత బౌలింగ్ లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. పూణే పిచ్ బౌలర్లకు సహకరించేదని ఆటగాళ్లందరికీ ముందే తెలుసు. ఈ నేపథ్యంలో భారత్ ఆసీస్ ఆటగాళ్ల మీద ఎలాంటి ప్రత్యేక కసరత్తులు చేసినట్టు కనిపించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటింగ్ లో ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల హెచ్చరికలతో స్పిన్ ఆడడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆసీస్ ఆటగాళ్లు ఎలాంటి తడబాటుకు లోను కాలేదు. అదే సమయంలో తమకు ఒక తురుపుముక్క ఉందని సగర్వంగా ప్రకటించారు.
ఆసీస్ ఆటగాళ్లు ఊహించినట్టే వారి తురుపుముక్క ఉచ్చులో టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు పడ్డారు. స్టార్ బౌలర్ స్టార్క్ ఇద్దరిని అవుట్ చేశాడు. దీంతో టీమిండియా అత్యల్ప స్కోరుకే పెవిలియన్ చేరింది. అనంతరం ఆసీస్ ఆటగాళ్లపై తమ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ లో ఐదు క్యాచ్ లు మన ఆటగాళ్లు నేలపాలు చేశారు. దీంతో ఆసీస్ 48 పరుగులు అదనంగా చేయగలిగింది. దీంతో భారత్ మెడపై ఓటమికత్తి వేలాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో పుంజుకుని ఆడకపోతే... భారత్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు ఆసీస్ ఎసరుపెట్టే అవకాశం ఉంది.