: శశికళ ఆదేశాలను డోంట్ కేర్ అంటున్న పళనిస్వామి.. చిన్నమ్మకు షాక్!

బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లే ముందు తన అక్క కుమారుడు దినకరన్ ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించారు. ఈ నేపథ్యంలో, ఎప్పటికైనా దినకరన్ నుంచి తన పదవికి ముప్పు ఉండవచ్చని ముఖ్యమంత్రి పళనిస్వామి భావిస్తున్నారు. అంతేకాదు, ఆమె చెప్పుచేతల్లో తనను ఉంచుకోవాలని శశికళ భావిస్తుండటాన్ని కూడా ఆయన తట్టుకోలేకపోతున్నారు. శశికళ డైరెక్షన్ కు అనుగుణంగా పని చేస్తే... ప్రజల్లో తనకు చెడ్డ పేరు వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టి, పాలనలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. అంతేకాదు, శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను సైతం తనవైపు తిప్పుకుంటున్నారు. పళనిస్వామికి అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు సెంగొట్టయ్యన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో, చిన్నమ్మపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాడు పళనిస్వామి. ఆమె ఆదేశాలను పాటించేది లేదంటూ గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో, కొంత మంది అధికారుల పేర్లు ఉన్న జాబితాతో జైల్లో ఉన్న శశికళను కలిశారు దినకరన్. ఇవన్నీ ట్రాన్స్ ఫర్లకు సంబంధించిన పేర్లు. ఆ జాబితాకు శశికళ ఆమోద ముద్ర వేసింది. అయితే శశికళ సిఫారసు చేసిన బదిలీలను పళనిస్వామి తిరస్కరించారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ ను వెంటనే బదిలీ చేయాలని పళనిస్వామిపై మన్నార్ గుడి వర్గం ఒత్తిడి తెచ్చిందట. అయితే, మంచి అధికారిగా పేరున్న గిరిజను బదిలీ చేస్తే చెడ్డ పేరు వస్తుందని భావించిన పళనిస్వామి... ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేశారట. దీంతో, జైల్లో ఉన్న శశికళకు ఏమీ తోచని పరిస్థితి తలెత్తిందట.
మరో విషయం ఏమిటంటే, సీఎం పదవిని చేపట్టి ఇన్ని రోజులు గడచినా... ఇంతవరకు శశికళను కలవడానికి జైలు వద్దకు వెళ్లలేదు పళనిస్వామి. అసలు ఆమె జైల్లో ఉన్నారన్న సంగతిని కూడా అతను మరిచిపోయినట్టున్నారు. అనుకూలంగా వ్యవహరిస్తాడనుకున్న పళనిస్వామి, ధిక్కార ధోరణితో వ్యవహరిస్తుండటం శశి వర్గీయులకు మింగుడు పడటం లేదు.