: అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, లేచిన వ్యక్తి.. పరుగులు తీసిన జనాలు!
చనిపోయాడనుకున్న వ్యక్తి అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. ఓ వైపు బంధువులంతా ఏడుస్తున్నారు. ఇంతలో పాడెపై ఉన్న వ్యక్తి హఠాత్తుగా లేచి, కూర్చున్నాడు. అంతే, అక్కుడున్న వారంతా బెంబేలెత్తి పోయారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఈ ఘటన కర్ణాటక యాదగిరి జిల్లా సురపుర తాలూకా మదలింగనాడు గ్రామంలో చోటు చేసుకుంది.
54 ఏళ్ల సోమనాళు అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆయనకు విజయపురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. ఈ క్రమంలో అతను బతకడం కష్టమని, హాస్పిటల్ నుంచి తీసుకెళ్లమని డాక్టర్లు ఆయన కుటుంబీకులకు తెలిపారు. దీంతో, ఈ నెల 19న ఆయనను అంబులెన్సులో స్వగ్రామానికి తరలించారు. మార్గమధ్యంలో సోమనాళు శ్వాస తీసుకోకపోవడంతో, అతను చనిపోయాడని అందరూ భావించారు. ఆ రోజు రాత్రి భజనలు కూడా చేశారు.
ఈ క్రమంలో, ఆయనకు అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. కడసారి చూసుకోవడానికి బంధువులు, మిత్రులు, గ్రామస్తులంతా వచ్చారు. ఇంతలో ఏమీ తెలియనట్టు సోమనాళు లేచి కూర్చున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక చుట్టూ చూశాడు. దీంతో, అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత సోమనాళు బతికే ఉన్నాడని నిర్ధారించుకున్నారు.