: రూ. 251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామన్న రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ అరెస్ట్
రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రింగింగ్ బెల్స్ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ అరెస్టయ్యారు. రూ.16 లక్షల మోసానికి పాల్పడినట్టు ఘజియాబాద్‌లోని ‘అయాం ఎంటర్‌ప్రైజెస్’ యజమాని బుధవారం మోహిత్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ మిశ్రా తెలిపారు.
ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసే బాధ్యతలు తీసుకోవాలంటూ నవంబరు 2015లో రింగింగ్ బెల్స్ ప్రతినిధులైన గోయల్ తదితరులు తనను కోరినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో రింగింగ్ బెల్స్‌కు రూ.30 లక్షలు చెల్లిస్తే తమకు మాత్రం రూ.13 లక్షల విలువైన ఉత్పత్తులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత తమ ఒత్తిడితో మరో లక్ష రూపాయల ఉత్పత్తులు ఇచ్చారని పేర్కొన్నారు. మిగిలిన రూ.16 లక్షల గురించి ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.