: కులమేదైనా.. కించపరిస్తే జైలే.. చట్ట సవరణకు కేంద్రం నిర్ణయం


ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల కోసం అమల్లో ఉన్న అట్రాసిటీ చట్టం లాంటిదాన్నే ఇతర కులాల వారికి కూడా తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కులం, జాతి పేరుతో అవమానాలకు గురవుతున్న వారికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాన్ని తయారుచేసే పనిలో పడింది. 2014లో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర యువకుడిపై జరిగిన దాడి ఘటనలో అప్పటి ప్రభుత్వం నియమించిన ఎంకే బారువా కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లో మార్పులు చేయనున్నారు.

ఇందులో భాగంగా కులం, జాతిపరంగా కించపరిచేలా చేసే వ్యాఖ్యలను తీవ్ర నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జన్మస్థలం, జాతి సంబంధ ముఖ కవళికలు ప్రదర్శించడం, ప్రవర్తన, సంప్రదాయాలు, వేషధారణ తదితర వాటి ఆధారంగా ఒక జాతి వ్యక్తిని అవమానించే ఉద్దేశంతో మాట్లాడినా, శబ్దం, సైగ చేసినా, అవమానించేలా ఏదైనా వస్తువును చూపినా దానిని బాధితుడు చూసినా, విన్నా అలా చేసిన వ్యక్తి శిక్షార్హుడవుతాడు. మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధించాలని బారువా కమిటీ సూచించింది. దీనిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలపగానే వచ్చే సమావేశాల్లోనే సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే జాతి ప్రస్తావనను కూడా కులం ప్రస్తావనగానే భావిస్తారు.

  • Loading...

More Telugu News