: పన్నీర్ సహా పార్టీకి గుడ్ బై చెప్పిన వారు తిరిగి వస్తే వారిని ఆహ్వానిస్తాం: దినకరన్
అక్రమాస్తుల కేసులో తాను జైలుకెళుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తన సోదరి కుమారుడు దినకరన్‌ను తమ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు దినకరన్ పార్టీలో తన బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని జైలు నుంచే ఆదేశాలు జారీ చేస్తోన్న శశికళ... దినకరన్‌ను చెన్నైలో ఉంచి పార్టీలో చక్రం తిప్పనున్నారు.
ఈ సందర్భంగా దినకరన్ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను పార్టీలోకి ఆహ్వానించారని, తనకు కీలక పదవులు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. జయలలిత వల్ల తాను గతంలో ఎంపీ కూడా అయ్యానని చెప్పారు. తమ పార్టీకి గుడ్ బై చెప్పిన పన్నీరు సెల్వంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి తిరిగి వస్తే వారిని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయంగా పాలన కొనసాగిస్తామని చెప్పారు.