: ఆసీస్ పై భారత్ అనుసరించిన వ్యూహమిదే!
తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆట కట్టించేందుకు కోహ్లీ చక్కటి వ్యూహాన్ని అనుసరించాడు. కేవలం స్పిన్నర్లను మాత్రమే నమ్ముకొని కోహ్లీ బౌలింగ్ లో వైవిధ్యాన్ని కోరుకున్నాడు. దీంతో భారత్ లో అత్యంత వేగంతో బతులు విసిరే ఉమేష్ యాదవ్ తోపాటు, వేగంతో పాటు స్వింగ్ చేయగల ఇశాంత్ శర్మను కూడా జట్టులోకి తీసుకున్నాడు. వైవిధ్యమైన స్పిన్ తో అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్ లతో కెప్టెన్ కోహ్లీ విరివిగా బౌలింగ్ చేయించాడు. ఫీల్డింగ్ సెట్టింగ్ ను కూడా పరుగులు నియంత్రించే విధంగా కాకుండా పేసర్లకు మూడు స్లిప్స్ లో ఫీల్డింగ్ పెట్టించాడు.
పేసర్లు ఆఫ్ సైడ్ బంతులను సంధించి ఆసీస్ బ్యాట్స్ మన్ కు సవాలు విసిరారు. స్పిన్నర్లకు రెండు స్లిప్స్, ఒక సిల్లీ పాయింట్ లో ఫీల్డింగ్ సెట్ చేశాడు. దీంతో ఆటగాళ్లు బంతిని స్వేచ్ఛగా ఆడేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. సిల్లీ పాయింట్ లో ఫీల్డర్ సిద్ధంగా ఉండడంతో బంతిని డిఫెన్స్ ఆడేందుకు కూడా ఆసీస్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఆడిన ఆసీస్ కోహ్లీ ఊహించినట్టే ఒత్తిడిలో పడింది. దీంతో తొలిరోజు భారత బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు.
చివర్లో భారత బౌలర్ల ఆధిక్యాన్ని మిచెట్ స్టార్క్ అడ్డుకున్నాడు. బౌలర్లకు ఏమాత్రం కొరుకుడు పడకుండా సింగిల్స్ తీస్తూ, కుదిరినప్పుడు భారీ సిక్సర్లు కొడుతూ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. స్టార్క్ ను అవుట్ చేసేందుకు కోహ్లీ వేసిన ఎత్తుగడలన్నింటినీ చిత్తుచేశాడు. టీమిండియా బౌలర్లందరినీ ఆడుకున్నాడు. దీంతో ఆసీస్ తొలి రోజు 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. స్టార్క్ రేపు బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు.