: నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు: ప్రధాన నిందితుడిని పట్టుకునే క్రమంలో హైడ్రామా
నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్‌ను కొచ్చిలోని జిల్లా కోర్టు వద్ద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు న్యాయస్థానం ముందు హైడ్రామా నడిచింది. భావన ఉదంతం జరిగి ఆరు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేక పోయిన పోలీసులు అతడి కోసం వేయి కళ్లతో వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో నిందితుడైన విగీష్‌తో కలిసి లొంగిపోయేందుకు సునీల్ కోర్టుకు వచ్చాడు. విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మేజిస్ట్రేట్ భోజనానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పోలీసులు లోపలకు దూసుకొచ్చి, మేజిస్ట్రేట్ కుర్చీ ఖాళీగా ఉండటంతో నిందితులకు ఉద్దేశించిన ప్రదేశంలో ఉన్న సునీల్‌ను బయటకు లాక్కొచ్చారు.
నిందితుడు వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కోర్టులోని న్యాయవాదులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలోనే సునీల్ ఓసారి కింద పడిపోయాడు. అతడిని పట్టుకున్న పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కోర్టు బయట ఉన్న వ్యానులోకి తోశారు. అయితే కోర్టు వద్ద పోలీసుల ప్రవర్తన పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో వున్న నిందితులను అలా అన్యాయంగా అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకమని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నిందితులను అలువాలోని పోలీసు క్లబ్ వద్ద పోలీసులు ప్రశ్నిస్తున్నారు.