: శివరాత్రి నాడు అంగరంగ వైభవంగా మేకల స్వయంవరం.. పెళ్లి!
ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లా పంట్వాడీ గ్రామంలో మూడు మేకల పేర్లు ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్, దీపికా పదుకొనె. ఈ మూడింటికీ ఆ గ్రామస్తులు ఈ శివరాత్రి రోజున పెళ్లి చేయనున్నారు. అందుకోసం మేకపిల్లల స్వయంవరం కూడా ఏర్పాటు చేశారు. ఎంపికైన 15 మేకల నుంచి ఈ మూడు మేకలు తమకు కావాల్సిన భాగస్వాములను ఎంచుకుంటాయి. అందుకోసం ప్రియాంక చోప్రా మేక పిల్ల ఓ రింగులో ఉంచిన ఐదు మేకల్లో ఒక మేకను ఎంపిక చేసుకుంటుంది. అలాగే మిగతా రెండు మేక పిల్లలయిన కత్రినాకైఫ్, దీపికా పదుకొనె కూడా వాటి ముందు ఉంచిన ఐదేసి మేకపిల్లల్లో ఒక మేకను ఎంచుకుంటాయి. ఆ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో జంతువులకు ఇలా స్వయంవరాలు ఏర్పాటుచేయడం వందల ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది.
ఈ వివాహం చేయడం కోసం ఆ ప్రాంత ప్రజలు ఓ పూజారితో పాటు మంగళ వాయిద్యాలను ఏర్పాటు చేస్తారు. వివాహ తంతుకి శుభలేఖలు కూడా అచ్చు వేయడమే కాకుండా, పెళ్లికూతుళ్లకు పసుపు, మెహెందీ, తిలకం దిద్ది అలంకారం చేస్తారు. అంతేకాదు, సదరు మేక పెళ్లికూతుళ్ల ఆరోగ్యం ఎలా ఉందో చూడటానికి పశువుల వైద్యులు కూడా అక్కడికి వస్తారు. ఇటువంటి స్వయంవరాలు చేస్తే పశు సంపదను పెంచుకోవచ్చని అక్కడి వారి నమ్మకం.