: భారత్ కు నన్ను రప్పించలేరు.. యూకే చట్టాల కింద సురక్షితంగా ఉన్నా: విజయ్ మాల్యా
బ్యాంకుల వద్ద భారీగా రుణాలు తీసుకుని, రూ. 9 వేల కోట్లకు ఎగనామం పెట్టిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా బ్రిటన్ కు చెక్కేశారు. ఆయనను భారత్ కు రప్పించేందుకు మన అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తుంటే... మాల్యా మాత్రం తనను ఇండియాకు రప్పించలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్ చట్టాల కింద తాను అత్యంత సురక్షితంగా ఉన్నానని చెప్పారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఒక్క రూపాయిని కూడా తాను దుర్వినియోగం చేయలేదని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసులను ఆయన కొట్టిపారేశారు. భారత్ లోని రెండు అతి పెద్ద పార్టీలు తనను ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ, ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవానికి తనది సివిల్ కేసు అని... కానీ, ప్రభుత్వ ఉత్తర్వులతో దాన్ని క్రిమినల్ కేసుగా మార్చారని ఆరోపించారు.
ప్రతి విషయాన్ని సవాల్ చేసే అవకాశం తనకు ఉందని మాల్యా అన్నారు. మరోవైపు, మీడియాపై కూడా మాల్యా విమర్శలు గుప్పించారు. ఫార్ములా వన్ కారు రేసులో మన దేశం ప్రాతినిధ్యం వహిస్తుంటే పొగడాల్సింది పోయి... దాన్ని కూడా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. భారతీయ మీడియా కథనాలు తనను ఎంతో బాధిస్తున్నాయని చెప్పారు.