: ఢిల్లీకి వెళతాం.. పోరాటం ఉద్ధృతం చేస్తాం: ప్రొ.కోదండరాం
హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించాలని చూసిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను నిన్న తెల్లవారు జామున అరెస్టు చేసి రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు టీజేఏసీ నేతలతో తన నివాసంలో చర్చించిన కోదండరాం అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలాఖరుకల్లా జేఏసీ మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అంతేగాక, భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాడతామని చెప్పారు.
సమస్యల మీద చర్చ జరగాలని, పరిష్కారం పొందాలని కోదండరాం సూచించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1న మహబూబ్ నగర్లోను, ఆ తర్వాత పలు జిల్లాల్లోను చర్చలు జరుపుతామని, ఇందులో భూనిర్వాసితుల సమస్యపై చర్చిస్తామని చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యపై ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని అన్నారు. ఎమ్మెల్యేలకు నిరుద్యోగ సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ కార్యాచరణ కొనసాగుతుందని అన్నారు.