: నా భార్య పేరు మిసెస్ శరత్ బాబు.. ఆ పేరు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు!: శరత్ బాబు
పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుగన్న శరత్ బాబు చివరకు సినీ నటుడయ్యారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 1973లో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన... ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. సినిమాలతో పాటు, సీరియల్స్ లో కూడా కొనసాగుతున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలతో పాటు 'వేకింగ్ డ్రీమ్స్' అనే ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు.
ఇలా సినీ రంగంలో ఎంతో సాధించిన శరత్ బాబు వైవాహిక జీవితం మాత్రం విచ్ఛిన్నమైంది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన భార్య పేరును ఉచ్చరించడానికి కూడా తాను ఇష్టపడనని చెప్పారు. తన భార్య పేరు మిసెస్ శరత్ బాబు మాత్రమే అని చెప్పారు. జీవితంలో చోటు చేసుకునే ఎన్నో సంఘటనల్లో పెళ్లి కూడా ఒక సంఘటనే అని అన్నారు. 'కొన్ని సంఘటనలు జీవిత కాలం ఉంటాయి... కొన్ని మాత్రం కాలగర్భంలో కలసిపోతుంటాయి' అని చెప్పారు. జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని అన్నారు.
శరత్ బాబు 1981లో నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. 1988లో ఆమెకు విడాకులు ఇచ్చారు. స్నేహలత నంబియార్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి వైవాహిక జీవతం కూడా కొనసాగలేదు. వీరు కూడా విడాకులు తీసుకున్నారు. మీకు ఎంత మంది పిల్లలు? అని చాలా మంది తనను అడుగుతుంటారని... తనకు పాతిక మంది పిల్లలు అని చెబుతుంటానని శరత్ బాబు అన్నారు. "అవును నిజమే. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలందరూ కలిపి పాతిక మంది వరకు ఉంటారు. వారంతా కూడా నా పిల్లలే కదా" అని శరత్ బాబు చెప్పారు. తాను పూర్తిగా శాకాహారమే తీసుకుంటానని... మన ఆకలిని తీర్చుకోవడానికి మరో ప్రాణిని చంపే హక్కు మనకు లేదని తెలిపారు.