: ఇద్దరు తెలంగాణ మంత్రుల శాఖల మార్పు!
తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రానున్న రాష్ట్ర బడ్జెట్ లో బీసీలు, అత్యంత వెనుకబడ్డ బీసీ కులాల (ఎంబీసీ)కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీసీ, ఎంబీసీ వృత్తులపై అవగాహన కలిగిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జోగు రామన్న వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను ఈటలకు ఇచ్చి... జోగు రామన్నకు పౌర సరఫరాల శాఖను ఇవ్వనున్నారు. దీంతో ఇకపై ఆర్థిక శాఖ, బీసీ సంక్షేమ శాఖలను ఈటల పర్యవేక్షించనున్నారు. జోగు రామన్న పౌర సరఫరాల శాఖను చూసుకుంటారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మార్పులకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.